![]() |
![]() |

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్రాంచైజీగా ఒకప్పుడు వెలిగిపోయింది యశ్‌రాజ్ ఫిలిమ్స్ వారి 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' (YRF Spy Universe). సల్మాన్ ఖాన్ 'ఏక్ థా టైగర్', హృతిక్ రోషన్ 'వార్', షారుఖ్ ఖాన్ 'పఠాన్' వంటి భారీ హిట్ సినిమాలతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ సిరీస్, ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు ఈ యూనివర్స్ నుండి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని నమ్మిన ప్రేక్షకులు, ఇప్పుడు థియేటర్లకు వెళ్లడానికే భయపడే పరిస్థితి వచ్చింది. వరుస వైఫల్యాలతో ఈ భారీ బాలీవుడ్ యూనివర్స్ పతనం దిశగా సాగుతోందనే ఆందోళన ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఒక రొటీన్ ఫార్ములాను నమ్ముకుని, కాలంచెల్లిన కథలతో సినిమాలను వండి వారుస్తుండటమే ఈ వైఫల్యాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఈ స్పై యూనివర్స్ డౌన్ ఫాల్ అనేది 'టైగర్ 3' సినిమాతోనే మొదలైంది. అయితే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన 'వార్ 2' (War 2) సినిమాతో ఈ ఫ్రాంచైజీ పూర్వ వైభవాన్ని అందుకుంటుందని అందరూ ఆశించారు. కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో 'వార్ 2' ఘోరంగా తడబడింది. ఇద్దరు భారీ స్టార్స్ చేతిలో ఉన్నప్పటికీ, దర్శకుడు వారి ఇమేజ్‌ను, కథను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. ఆడియెన్స్ అంచనాలను రీచ్ కాకపోవడంతో ఈ చిత్రం వైఆర్ఎఫ్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేసింది. కథల్లో, నిర్మాణంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా మితిమీరిన జోక్యం చేసుకోవడం వల్లే ఈ పతనం ప్రారంభమైందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇక ఇటీవలే జూలై 3న విడుదలైన 'ఆల్ఫా' (Alpha) చిత్రం ఈ యూనివర్స్ భవితవ్యాన్ని మరింత ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఆలియా భట్, శర్వరీ వాగ్ ప్రధాన పాత్రల్లో లేడీ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈసారి కథా చర్చల్లో ఆదిత్య చోప్రా తమ్ముడు ఉదయ్ చోప్రా కూడా భాగస్వామి అయినప్పటికీ, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. థియేటర్లలో కనీస ఫుట్ ఫాల్స్ రాబట్టడంలో 'ఆల్ఫా' పూర్తిగా ఫెయిల్ అయింది. సీనియర్ బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ చిత్రానికి బిలో యావరేజ్ రేటింగ్స్ ఇవ్వడం గమనార్హం. పాత చింతకాయ పచ్చడి లాంటి స్పై టెంప్లేట్, బోర్ కొట్టించే స్క్రీన్‌ప్లే కారణంగా ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించారు.
ఈ వరుస బాక్సాఫీస్ పరాజయాల నేపథ్యంలో, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌కు ఎండ్ కార్డ్ పడే సమయం దగ్గరపడిందంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే లైన్ లో ఉన్న 'టైగర్ 4', అలాగే భారీ అంచనాలు ఉన్న 'పఠాన్ వర్సెస్ టైగర్' వంటి ప్రాజెక్టులను ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టడం లేదా పూర్తిగా ఆపేయడం బెటర్ అనే కామెంట్లు వస్తున్నాయి. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని ఆదిత్య చోప్రా ఈ కథల ఫార్ములాను మారుస్తారా, లేక ఈ విమర్శలను లైట్ తీసుకుని పాత పంథాలోనే వెళ్తారా అనేది మిగిలిన సినిమాల భవిష్యత్తును నిర్ణయించనుంది.
YRF Spy Universe, Jr NTR, War 2, Alia Bhatt, Alpha
![]() |
![]() |